పట్టాలెక్కిన కొడంగల్‌ | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కిన కొడంగల్‌

Mar 17 2026 7:55 AM | Updated on Mar 17 2026 7:55 AM

నారాయణపేట–మక్తల్‌–కొడంగల్‌ ఎత్తిపోతల్లో కదలిక

తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ

కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్‌ చానల్‌, పంప్‌హౌస్‌ వర్క్స్‌ ముమ్మరం

మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్‌ వెంట గ్రీన్‌బెల్ట్‌

56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్‌ వెంట గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు.

స్టేజీ–1 పనులు

ప్రారంభం..

రూ.4,885 కోట్ల వ్యయంతో కొడంగల్‌–నారాయణపేట–మక్తల్‌ ఎత్తిపోతల పథకం పనులను మూడు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో స్టేజీ–1 (కాట్రేవులపల్లి), స్టేజీ–2 (ఊట్కూరు/బాపూర్‌), స్టేజీ–3 (జాయమ్మ చెరువు)కి సంబంధించి పంప్‌హౌస్‌లు, పైపులైన్‌ పనులు చేయాలి. ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రూ.1,400 కోట్లు మంజూరు కాగా.. సంబంధిత కాంట్రాక్టర్లు స్టేజీ–1లో భాగంగా మక్తల్‌ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్‌ చానల్‌, పంప్‌హౌస్‌ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్‌గోడు, కాచ్‌వార్‌ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు అనుసంధానం చేసేలా ప్రెషర్‌ మెయిన్‌ పైపులను కాచ్‌వార్‌ వద్ద అందుబాటులో ఉంచారు.

ఆ రిజర్వాయర్లు ఇవే..

ఊట్కూరు (మక్తల్‌), జాజాపూర్‌, పేరుపళ్ల జాయమ్మ (నారాయణపేట), కాన్‌కుర్తి (దామరగిద్ద), దౌల్తాబాద్‌, కొడంగల్‌, హస్నాబాద్‌, బొంరాస్‌పేట, లక్ష్మీపూర్‌, ఈర్లపల్లి (కొడంగల్‌).

సీఎం ప్రత్యేక నజర్‌..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014లో జీఓ 69 ద్వారా కొడంగల్‌ లిఫ్ట్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం దీన్ని పక్కనబెట్టి పాలమూరు–రంగారెడ్డి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు నీరందించేలా ముందుకు సాగింది. అయితే ఆనాడు జీఓ 69ని తీసుకురావడంలో అప్పటి కొడంగల్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రమంలో 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం.. ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ కొడంగల్‌ ఎత్తిపోతలపై ఆశలు చిగురించాయి. ఆయన ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకంగా దృష్టిసారించి.. పలు సమీక్షలు, భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ అడ్డంకులు అధిగమించి కొడంగల్‌–నారాయణపేట–మక్తల్‌ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో మూడు నియోజకవర్గాల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement