నిధుల కేటాయింపులో మల్లమ్మకుంటకు దక్కని చోటు
రాజోళి: ఆర్డీఎస్ రైతులకు జీవం పోస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో కీలకపాత్ర పోషించే మల్లమ్మ కుంటపై మళ్లీ చిన్నచూపే చూశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మూడు రిజర్వాయర్లు (మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు) నిర్మిస్తేనే ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు వరకు పుష్కలంగా సాగునీరు అందేలా డిజైన్ చేశారు. కానీ, రైతుల అవసరాల దృష్ట్యా నీటిని మోటార్ల ద్వారా ఆర్డీఎస్ కెనాల్‌లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో ఆయకట్టు పూర్తిగా కాకపోయినా కొంతమేర నీరంది పంటలు పండుతున్నాయి. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నేటికీ పూర్తికాకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తుంది.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మూడు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోపాటు జరుగుతున్న కాలయాపన, భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో మూడు రిజర్వాయర్లు కాకపోయినా కనీసం మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక్కటైనా పూర్తి చేస్తే ఆయకట్టును కాపాడుకోవచ్చని అంటున్నారు. కానీ, దానిపై కూడా ప్రభుత్వం అడుగు ముందడుగు వేయడం లేదు. తుమ్మిళ్ల ఎత్తిపోతలలో మొదటి రిజర్వాయర్ మల్లమ్మ కుంటనే. 1.02 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. వర్షాకాలం మొదట్లో తుంగభద్ర నదిలో వరద ఉన్న సమయంలో నీటిని ఈ రిజర్వాయర్‌లో ఎత్తిపోసి.. ఆయకట్టుకు సాగునీరు అవసరమైన సమయంలో వాడుకునేలా ప్లానింగ్ చేశారు. తుమ్మిళ్ల లిఫ్టు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం పైప్‌లైన్ ద్వారా నీటిని కెనాల్‌లో వదులుతున్నారే తప్ప.. రిజర్వాయర్ పనులు మొదలుపెట్టడం లేదు. నాలుగేళ్ల తర్వాత 2024లో మల్లమ్మకుంటకు సంబందించి భూ సేకరణ పనులపై కొంత కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
మూడు రిజర్వాయర్లు..
పెండింగ్ ప్రాజెక్టుల్లోనూ ప్రాముఖ్యం కల్పించని వైనం
ఈ రిజర్వాయర్‌పైనే ఆశలు పెట్టుకున్న ఆర్డీఎస్ రైతులు
ఇప్పటికే భూ సేకరణకు ప్రతిపాదనలు


