జన గణనపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జన గణనపై అవగాహన పెంచుకోవాలి

Mar 17 2026 7:55 AM | Updated on Mar 17 2026 7:55 AM

గద్వాల: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, అందుకనుగుణంగా గణనపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన, ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026లో మొదటి విడతలో ఇళ్ల గణన కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటలైజేషన్‌ విధానంలో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చేపట్టాలన్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదు చేసి ఇళ్ల జాబితా రూపొందిస్తారన్నారు. ఈ ప్రక్రియను ఎన్యుమరేటర్లు సూపర్‌వైజర్లు, చార్జీ అధికారులైన తహసీల్దార్లు, ఎంపీడీఓలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉండే జనాభా ఆధారంగా బ్లాక్‌లుగా విభజించుకుని గణన చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఇళ్ల గణన పూర్తయితే 2027 ఫిబ్రవరిలో ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించి 33 ప్రశ్నలను అడిగి వివరాలను నమోదు చేస్తారన్నారు. ప్రస్తుతం చేపట్టే గణన ఆధారంగానే భవిష్యత్‌లో వివిధ వర్గాలకు పథకాలు అందుతాయన్నారు. జిల్లాలో సుమారు 1,100 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు అవసరమవుతారని, ఉపాధ్యాయులకు ఈ విధులను అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాబితా రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, సెన్సెస్‌ ఆపరేషన్‌ జేడీ లాజర్‌, సీపీఓ పాపయ్య, ట్రైనర్‌ సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల కొరత రానీయొద్దు

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలో సుడిగాలి పర్యటన చేసి ఎరువుల దుకాణాలు, గాంధీచౌక్‌లోని దూద్‌ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువు దుకాణంలో స్టాక్‌, ధరలను పరిశీలించారు. అన్ని విక్రయాలను ఈపాస్‌ యంత్రం ద్వారా మాత్రమే నిర్వహించాలని, లైసెన్స్‌ లేకుండా ఎరువుల విక్రయాలు చేపట్టరాదన్నారు. అనంతరం గాంధీచౌక్‌లోని దూద్‌దవాఖానాలో వైద్య సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. అంతకు ముందు గోనుపాడు శివారులో సాగుచేసిన పంటలను పరిశీలించారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వే, ఫార్మర్‌ రిజిస్ట్రీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement