గట్టు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రాం చట్టం వ్యవసాయ కూలీలకు తీవ్రనష్టం చేసేలా ఉందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నర్సింహ అన్నారు. సోమవారం ఆయన గట్టులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఉపాధి కూలీల చేత పనిచేసే చోట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా ఉపాధి కూలీలు పని అడిగే హక్కు కోల్పోతారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల ఇప్పటికే వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పనిచేస్తున్న కూలీల కళ్ల ఫొటోలను తీసి అప్‌లోడ్ చేస్తున్నారని, కొందరు కూలీలవి సరిగా నమోదు కాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం చెల్లించాల్సి ఉండగా, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చెల్లించాలనే కొత్త నిబంధన పెట్టిందని విమర్శించారు. కొత్త చట్టాన్ని రద్దు చేసిన పాత, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.


