గట్టు: సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. శుక్రవారం గట్టులో కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్లకు సమ్మిళిత జీవనోపాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొదటి విడతగా ఎంపికచేసిన 17 గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉన్న వారిని శాసీ్త్రయంగా గుర్తించి.. వారికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందించడమే లక్ష్యమన్నారు. పేద కుటుంబాలకు ఆధార్, ఓటరుకార్డులు వంటి ప్రాథమిక ధ్రువపత్రాలను అందజేయడంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. అదే విధంగా శాశ్వత ప్రాతిపదికన జీవనోపాధి మార్గాలు చూపిస్తామన్నారు. కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా.. సామాజిక, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ బృహాత్తర కార్యక్రమంలో సీఆర్‌పీలు కీలక పాత్ర పొషించాలని.. క్షేత్రస్థాయిలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసరావు, డీపీఎం సలోమి, ఎంపీడీఓ చెన్నయ్య, సమాఖ్య సభ్యులు వెంకటేశ్వరి, అక్షర, మహేశ్వరమ్మ, ఏపీఎం మారుతి, నీతి అయోగ్ కోఆర్డినేటర్ అఫ్జల్ పాల్గొన్నారు.


