వైద్యులతో సమీక్ష అనంతరం నవజాత శిశువు, గైనకాలజీ, దంత, కంటి, కాన్పుల వార్డు, అత్యవసర విభాగం, స్కానింగ్, టీ హబ్, ఎక్స్‌రే, చిల్డ్రన్స్, ఈఎన్‌టీ, రేడియాలజీ తదితర వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆయా విభాగాల్లో సేవలు పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడి, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై వాకబు చేశారు. ఈ క్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వివిధ పరీక్షల కోసం తీసుకెళ్లాల్సిన కేర్ టేకర్స్ అందుబాటులో లేకపోవడంతో తామే స్వయంగా వీల్‌చైర్‌పై తీసుకెళ్తున్నామని కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. అదే విధంగా ఆస్పత్రిలోని మూత్రశాలలకు తాళాలు వేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్‌లో మూత్రశాలకు తాళం వేయడాన్ని గుర్తించిన కలెక్టర్.. సిబ్బందిని మందలించారు. రోగులకు సేవలు అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలన్నారు. రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


