ఆయిల్‌పాం సాగుతో స్థిర ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగుతో స్థిర ఆదాయం

Mar 11 2026 7:46 AM | Updated on Mar 11 2026 7:46 AM

ఎర్రవల్లి: ఆయిల్‌పాం సాగుతో రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఆయిల్‌ఫెడ్‌ జిల్లా అధికారి శివనాగిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పుటాన్‌దొడ్డి రైతువేదికలో వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పాం సాగు చేపట్టే రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. ఎకరాకు 55 మొక్కలు నాటుకోవాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా ఆయిల్‌పాం మొక్క ధర రూ.190 ఉండగా.. ప్రభుత్వం సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుందన్నారు. నాలుగేళ్ల పాటు అంతర పంటల సాగు చేసుకోవడంతో పాటు తోట నిర్వహణ కోసం ఎకరానికి రూ. 4,200 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం బీచుపల్లి ఆయిల్‌ మిల్లులో సివిల్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. త్వరలోనే రిఫైనరీల ఏర్పాటుతో కంపెనీ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

● రెయిన్‌ ఫీడ్‌ క్లస్టర్‌ పరిధిలోని రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డివిజన్‌ హార్టికల్చర్‌ అధికారి ఇమ్రానా అన్నారు. రైతులు సుస్థిర వ్యవసాయ పద్ధతులతో వైవిద్యమైన పంటల సాగుతో మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీన్ని ద్వారా ఉద్యాన, పశు, మత్స్య తదితర రంగాలకు చెందిన వారు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అభివృద్ధి సాధించవచ్చన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ సురేశ్‌గౌడ్‌, ఆయిల్‌ఫెడ్‌ కంపెనీ అధికారి రామకృష్ణ, ఏఈఓలు నరేశ్‌, బిందు, జెన్నిఫర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement