గద్వాల: జిల్లాలోని గట్టు బ్లాక్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రీజినల్ బెస్ట్ ప్రాక్టీస్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరపున జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి యాస్పిరేషనల్ ప్రోగ్రాంకు ఎంపికై న గట్టు మండలంలో విద్యారంగంలో అమలుచేస్తున్న వినూత్న కార్యక్రమాలను సెమినార్‌లో కలెక్టర్ సమగ్రంగా వివరించారు. గట్టు మండలంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండేదని, విద్యా ప్రమాణం లోపం వంటి సవాళ్లను జిల్లా పరిపాలన యంత్రాంగం గుర్తించి వాటిని అధిగమించేందుకు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమణాలు మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న పలు వినూత్న కార్యక్రమాలను సెమినార్‌లో ప్రస్తావించారు. జోగుళాంబ గద్వాల పరిపాలన యంత్రాంగం గట్టు బ్లాక్ చేపట్టిన ఉత్తమ కార్యాచరణను అభినందిస్తూ నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్ కలెక్టర్ రిజ్వాన్‌బాష షేక్‌కు జ్ఞాపిక అందజేశారు.


