గద్వాల: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం జిల్లావ్యాప్తంగా మొదలైంది. కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అధికారులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు కార్యక్రమంలో గ్రామ పంచాయతీలలో సర్పంచులు, కార్యదర్శులు, మున్సిపాలిటీలలో చైర్మన్లు, కమిషనర్లు, మండలాల పరిధిలో రెవెన్యూ శాఖకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలు, వార్డులలో ర్యాలీలు నిర్వహించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. 99 రోజులపాటు నిర్దేశించిన షెడ్యూల్డ్ ప్రకారం 10 ముఖ్య అంశాలలో పరిశుభ్రత కార్యక్రమంతో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అన్ని శాఖలలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 15వ వరకు పరిశుభ్రత కార్యక్రమంతోపాటు పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇదివరకే శాఖల వారీగా ఉన్న పెండింగ్ ఫైళ్లపై కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మార్చి నెల ముగిసేలోపు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి నిర్దేశించిన లక్ష్యం సాధించేలా అవరమైన చర్యలు చేపడుతున్నారు.


