వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు

Mar 5 2026 7:30 AM | Updated on Mar 5 2026 7:30 AM

మానవపాడు: మండల పరిషత్‌ కార్యాలయాలు, పంచాయతీ క్లస్టర్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. వీరికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో ధ్రువపత్రాల జారీ, పంచాయతీ ఆదాయ, వ్యయాలు, పన్నుల వసూళ్లు, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలు, గృహ నిర్మాణాలకు అనుమతులు తదితర పనులను ఈ–పంచాయతీ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. వీరికి నెలనెలా వేతనం అందించకపోవడంతో పాటు వచ్చే అరకొర జీతంలోనూ కోత పెడుతుండటంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

మండలానికో ఆపరేటర్‌..

జిల్లాలోని 13 మండలాల్లో 284 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల పరిషత్‌ కార్యాలయాల్లో 13 మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం.. ధ్రువపత్రాల జారీ నుంచి ప్రభుత్వ పథకాల దరఖాస్తుల నమోదు తదితర పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఆపరేటర్లకు వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదు నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే మార్చిలోనూ వేతనాలు చెల్లించకపోతే సమ్మెబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఇచ్చే వేతనంలోనూ కోత..

ఈ–పంచాయతీ ఆపరేటర్లకు గతంలో నెలకు రూ. 22,750 చొప్పున ఆయా పంచాయతీల నుంచి ఎంపీడీఓలు సర్దుబాటు చేశారు. అయితే ప్రభుత్వం గతేడాది జూన్‌ నుంచి రూ.3,250 కోత విధించి.. రూ. 19,500 చెల్లిస్తుంది. అది కూడా ప్రతినెలా కాకుండా రెండు, మూడు నెలలకోసారి చెల్లిస్తుండటంతో ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. గతేడాది అక్టోబర్‌ నుంచి నేటి వరకు వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఈ–పంచాయతీ ఆపరేటర్లకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

ఈ–పంచాయతీ ఆపరేటర్లకు ఐదు నెలలుగా అందని జీతాలు

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement