అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Mar 5 2026 7:30 AM | Updated on Mar 5 2026 7:30 AM

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై నిర్లక్ష్యం చేయెద్దు

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల: జిల్లాలో ఈ నెల 6 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు 90 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని.. అన్నిశాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్‌ సమావేశమై ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి.. 99 రోజుల కార్యక్రమాలపై పక్కా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భూ భారతి, ట్రేడ్‌ లైసెన్స్‌, భవన నిర్మాణాల అనుమతులు తదితర దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి..

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల సన్నాహాకం, పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. సీ, డీ కేటగిరీల్లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలతో సాధన చేయించి.. విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా పరీక్షలకు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.

● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్‌ సమావేశమై.. వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి వివిధ అంశాలను తెలియజేస్తూ, ప్రేరణ కలిగించారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి.. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమని.. ఇందులో మంచి మార్కులు సాధిస్తే భవిష్యత్‌లో ఉన్నత చదువులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, హెచ్‌ఎం రేణుకాదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement