పోలీసు సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తాం
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పించి.. బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీఎస్‌ఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి పదో బెటాలియంలో ఎస్పీ శ్రీనివాసరావు, కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ సిబ్బందితో అడిషనల్ డీజీపీ సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అదే విధంగా ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
● పోలీస్ వృత్తి ఎంతో ఉత్తమమైనదని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బెటాలియన్‌లో అందిస్తున్న అత్యాధునిక వసతులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి.. బెటాలియన్‌కు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌ఎస్పీ అడిషనల్ డీజీపీ
సంజయ్‌కుమార్ జైన్


