జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేద్దాం
గద్వాల: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జిల్లా వెనుకబడిందని.. ఓటరు మ్యాపింగ్‌పై సంబంధిత బీఎల్‌ఓలకు లక్ష్యాలను నిర్ధేశించి.. వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తిచేసి.. రైతులందరికీ కామన్ రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ 39 పారామీటర్లలో మెరుగుపడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తాను పనిచేసిన జనగామ జిల్లాను మొదటి స్థానంలో సాధించిందని.. గద్వాల సైతం మెరుగైన స్థానంలో ఉండేలా పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● రంజాన్ మాసం నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా కేంద్రంలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లీంలు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


