గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకం
ఎర్రవల్లి: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. ప్రభుత్వం అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకొని పల్లెల ప్రగతికి పాటుపడాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. స్థానిక పదో బెటాలియన్‌లో ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, రాజోళి, అయిజ మండలాలకు చెందిన 99 మంది సర్పంచులకు ఐదు రోజులపాటు నిర్వహించిన రెండో విడత శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి సర్పంచ్ అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు, విధులు, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల సంప్రదింపు విధానం వంటి అంశాలపై సర్పంచులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తూ.. ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యకు బలమైన పునాదులుగా మార్చాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలను ప్రోత్సహిస్తూ.. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న సర్పంచులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


