అంతులేని అవినీతి!
బెంబేలెత్తిపోతున్న
కొత్త అధికారి..
గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాల జోరు
● పైరవీకారులను పెంచి పోషించిన
గత తహసీల్దార్
● ప్రతి పనికి లెక్కగట్టి వసూలు
● ఆరోపణలు వెల్లువెత్తడంతో బదిలీ వేటు
● గతంలోనే సదరు తహసీల్దార్
అక్రమార్జనను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
●
గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇటీవల బదిలీ వేటు పడిన ఓ తహసీల్దార్ అవినీతికి మారుపేరుగా నిలిచి దొరికినకాడికి దోచేశారు. ఆయన ఏకంగా తన చాంబర్‌లోనే పైరవీకారులతో లావాదేవీలు కొనసాగిస్తున్న వైనాన్ని గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అవినీతి అధికారిపై పెద్దఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు.. ఇటీవల ఆయనపై బదిలీ వేటు వేయడం జిల్లా కేంద్రంలో హాట్ టాఫిక్‌గా మారింది.
అధికారుల సంతకాలు ఫోర్జరీ..
తహసీల్దార్ కార్యాలయం వద్ద తిష్టవేసిన కొందరు రైటర్లు ఏకంగా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ధ్రువపత్రాలు జారీ చేసిన ఘటనలు వెలుగుచూశాయి. వీటిపై సదరు అధికారులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు సైతం చేశారు. అయితే అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన సదరు పెద్ద సార్ అండగా నిలవడంతో ఎలాంటి చర్యలు లేకుండాపోయాయి.
అనుమతులు లేకుండానే..
తహసీల్దార్ కార్యాలయ పరిసర ప్రాంతంలో రాజీవ్‌మార్గ్ రోడ్డు పక్కన వెలసిన రైటర్లకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు కాని.. రైటర్లుగా కొనసాగేందుకు ఎలాంటి లైసెన్స్ లేవు. కానీ వీరు మాత్రం రోడ్డుపక్కన దర్జాగా టేబుళ్లు, కుర్చీలు వేసుకుని అక్రమాలకు పాల్పడున్నారు. కాగా, అనుమతులు లేకుండా వ్యాపారాలు, ఇతర లావాదేవీలు చేస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అక్రమార్కుల వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇందుకు వారికి చోటామోటా లీడర్లు అండగా నిలిచి కొమ్ముకాస్తుండటమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచి బదిలీ వేటుకు గురైన సదరు పెద్ద సార్ స్థానంలో కొత్తగా వచ్చిన అధికారి బాధ్యతలు స్వీకరించేందుకు బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. ఏ ఫైల్ ఎక్కడ ఉందో.. ఎక్కడ మాయం చేశారో అనే భయంతో ఉన్నారనే ప్రచారం ఉందంటే.. గతంలో ఇక్కడ పనిచేసిన పెద్ద సార్ ఏస్థాయిలో దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. కొత్తగా వచ్చే అధికారి మూడంచెల అక్రమాలకు చెక్‌పెట్టి నేరుగా సేవలు అందించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అంతులేని అవినీతి!


