మూడంచెలుగా పైరవీకారులు..
గద్వాల తహసీల్దార్ కార్యాలయ ప్రహరీని అనుసరించి రాజీవ్‌మార్గ్ రోడ్డు వెంట కొందరు రైటర్ల ముసుగులో తిష్టవేశారు. కార్యాలయంలో ఏ చిన్న పనికావాలన్నా వీరి ద్వారానే జరగాలన్నది ఇక్కడి రూల్. ప్రతి పనికి వీరు రేట్లు ఫిక్స్ చేశారు. కాలయాపన లేకుండా కులం, ఆదాయం, లోకల్ సర్టిఫికెట్ కావాలంటే రూ.200 నుంచి రూ. 500 వరకు చెల్లించాల్సిందే. అదే విధంగా భూ సంబంధ డాక్యుమెంట్లకు రూ. 1,000 నుంచి రూ. 1,500 చెల్లించాలి. ఇక ప్రభుత్వం పేదలకు అందించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు ఏకంగా రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు ముట్టజెప్పాల్సిందే. మొదటి దశలో ఇలా ఫిక్స్ చేసిన ధరలు సదరు రైటర్లకు చెల్లిస్తేనే పనికి సంబంధించిన ఫైళ్లు రెండో దశలో కార్యాలయం వెలుపల చెట్లకింద ఉండే పైరవీకారుల వద్దకు వెళ్తుంది. ఈ పైరవీకారులు మూడవ దశలో కార్యాలయంలో పెద్ద సార్‌ను సంప్రదిస్తారు. అనంతరం సదరు పెద్ద సార్‌కు ముడుపులు ముట్టజెప్పిన అనంతరం ఫైళ్లు సంబంధిత సెక్షన్ అధికారుల టేబుల్‌పైకి చేరుతుంది. అక్కడ కూడా వారికి చెల్లించాల్సిన ముడుపులు అందిన తర్వాత ఫైళ్లకు మోక్షం లభిస్తుంది. ఇలా గద్వాల మండల రెవెన్యూ కార్యాలయంలో మూడంచెల అవినీతికి పాల్పడుతూ గత తహసీల్దార్ రూ. కోట్లలో దోచుకున్నారని సదరు కార్యాలయ సిబ్బందే బాహాటంగా చర్చించుకుంటున్నారు.


