అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
అలంపూర్: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాలకు చెందిన 515 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నానని.. ఒకేసారి ఇంత మంది లబ్ధిదారులకు చెక్కులు అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


