పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకం

Feb 24 2026 7:09 AM | Updated on Feb 24 2026 7:09 AM

పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకం

పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకం

ప్రజావాణికి 64 ఫిర్యాదులు

ఎర్రవల్లి: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. సోమవారం పదో బెటాలియన్‌లో ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, రాజోలి, అయిజ మండలాలకు చెందిన 99 మంది సర్పంచులకు నిర్వహించిన రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సర్పంచ్‌ పదవి అత్యంత ముఖ్యమైనదని, ప్రతి సర్పంచ్‌ అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలన్నారు. ఐదు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమానికి సర్పంచులు తప్పనిసరిగా హాజరై పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం అన్ని నియమాలు, నిబంధనలు, విధులు, నిధులు, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌, ప్రభుత్వ పథకాల వినియోగం, అధికారుల సంప్రదింపు తదితర అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించి, ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యకు బలమైన పునాదులుగా మార్చాలని కోరారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి.. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం సర్పంచుల బాధ్యత అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా సర్పంచులు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, బెటాలియన్‌ కమాండెంట్‌ జయరాజు, ఏఎస్పీ శంకర్‌, డీపీఓ శ్రీకాంత్‌, డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై కలెక్టర్‌కు నేరుగా వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొత్తం 64 ఫిర్యాదులు వచ్చాయని, వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఇన్‌చార్జి ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement