ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన ఉత్పత్తులు
గద్వాల వ్యవసాయం: ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని డీఏఓ సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం గద్వాల మండలం అనంతాపురం రైతువేదికలో ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తగ్గడంతో పాటు, పండించిన పంట ఉత్పత్తులకు మంచి ధరలు వస్తాయన్నారు. ఈ విధానంతో రసాయనిక ఎరువులు, మందుల వినియోగం తగ్గి.. భూ సారం పెరుగుతుందన్నారు. కృషి సఖిలు శిక్షణలో నేర్చుకున్న అంశాలను రైతులకు పూర్తిస్థాయిలో వివరించి, ప్రకృతి వ్యవసాయంపై అగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ఉద్దేశం, ఆవశ్యకత, సూత్రాలు, నేల ఆరోగ్యం తదితర వివరాలను సీఎస్‌ఏ ప్రోగ్రాం అధికారి ఉపేంద్ర, అగ్రి ఎక్స్‌పర్ట్ వీరబాబు తెలియజేశారు. అనంతరం రైతులు గోకారి, రవిరెడ్డి, సత్యమ్మను డీఏఓ సన్మానించారు. కార్యక్రమంలో ఏఓ ప్రతాప్‌కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,777
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 296 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,777, కనిష్టంగా రూ. 4,906, సరాసరి రూ. 5,850 ధరలు వచ్చాయి. అదే విధంగా 8 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,026, కనిష్టంగా రూ. 5,980, సరాసరి రూ. 6026 ధరలు లభించాయి. 81 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,559, కనిష్టంగా రూ. 2,096, సరాసరి రూ. 2,551 ధరలు వచ్చాయి. 150 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,649, కనిష్టంగా రూ. 2,116, సరాసరి రూ. 6,613 ధరలు లభించాయి.


