స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
చలికాలంలో పిల్లలు, వృద్ధులపై అప్రమత్తత అవసరం
● నిర్లక్ష్యం వహిస్తే న్యుమోనియా, శ్వాస సంబంధ సమస్యలు తీవ్రం
● గోరువెచ్చటి నీరు, వేడి పదార్థాలతో మేలు
● ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి
ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు
పాటించాలి? – కిరణ్, గద్వాల
డీఎంహెచ్‌ఓ: ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం ఉత్తమం. నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండ్లు, ఐస్‌క్రీంల జోలికి వెళ్లొద్దు. చలికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటారు. అలా చేయకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారాన్ని తగ్గించి తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్ధాలు తీసుకోవాలి.
ప్రశ్న: బీపీ, షుగర్, గుండె జబ్బు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.? – ఏడీ అరుణ్‌కుమార్, గద్వాల
డీఎంహెచ్‌ఓ: బీపి, షుగర్, గుండె జబ్బు ఉన్నవారు చలి ఎక్కువగా ఉన్న సమయంలో తిరగరాదు. చలి ప్రభావంతో రక్త నాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తద్వారా అకస్మత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బీపీ పేషెంట్లకు ఆక్సిజన్ అందక హైపర్ టెన్షన్‌కు గురవుతారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తం చలికి చిక్కబడి బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారి తీస్తుంది. వృద్ధులు, గర్భిణులకు ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లోనే ఉన్ని దుస్తులు ధరించి ఉండడం మంచిది. యోగా లేదా తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
గద్వాల క్రైం: చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులపై అప్రమత్తంగా ఉండాలని.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని.. జలుబు, జ్వరం, న్యుమోనియా, ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలు, వ్యాధులపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఏదైనా వ్యాధి భారిన పడితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లేదా జిల్లా ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫోన్ ఇన్‌లో ప్రజల సందేహాలు, డీఎంహెచ్‌ఓ సూచనలు ఇలా..
ప్రశ్న: చలికాలంలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏమిటీ? ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
– విజయ్‌కుమార్, గద్వాల
డీఎంహెచ్‌ఓ: జలుబు, చలి జ్వరం, ఆస్తమా, న్యుమోనియా, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తాం. ప్రస్తుతం లెప్రసీ సర్వే కొనసాగుతుంది. సర్వేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
ప్రశ్న: మూడు రోజులుగా ఒళ్లు నొప్పులు, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి ?
– రవిబాబు నాయుడు, కేటీదొడ్డి
డీఎంహెచ్‌ఓ: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లి వైద్యుడిని కలవండి. వ్యాధి నివారణకు మందులు తీసుకోండి. చలి తీవ్రత అధికంగా ఉండే సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండండి. వ్యాధి తగ్గకుంటే రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని వైద్యం పొందండి.
ప్రశ్న: తరచూ ఇంటిల్లిపాది జ్వరం, జలుబు బారినపడుతున్నాం. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
– వసంత, గృహిణి, అలంపూర్
డీఎంహెచ్‌ఓ: ఉదయం ఎండ వచ్చే వరకు బయటకు రావద్దు. పిల్లలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో యోగా చేయడం ఉపశమనంగా ఉంటుంది. ఉన్ని దుస్తులు ధరించాలి.
ప్రశ్న: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా
ఉంది. బయట పడేదెలా?
– సుఫియాన్, ఆనంద్, గద్వాల
డీఎంహెచ్‌ఓ: గోరువెచ్చని నీటితో ఆవిరి తీసుకోండి. వీలైనంత వరకు పౌష్టికాహరం, తాజా పండ్లు, గోరువెచ్చని నీరు తాగండి. మందులు వాడినా సమస్య అలాగే ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే చాతీ ఎక్సరే చేయించుకుని మందులు తీసుకోవాలి. చలి గాలులతో ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చల్లటి గాలిలో ప్రయాణాలు చేయొద్దు.
ప్రశ్న: పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి..?
– ధరణి గృహిణి, గద్వాల
డీఎంహెచ్‌ఓ: కూల్‌డ్రింక్స్, స్వీట్స్‌కు దూరంగా ఉంచాలి. వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. సాయంత్రం నుంచే వెచ్చని దుస్తులు ధరించాలి. ఇంట్లోనే వ్యాయామాలు చేయాలి. చలి పెరిగే సమయాల్లో బయటకు పంపొద్దు.
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ


