నర్సింగ్ కళాశాల పనులు త్వరగా పూర్తి చేయాలి
యూరియా కొరత లేకుండా పూర్తి స్థాయి చర్యలు
గద్వాలన్యూటౌన్: జిల్లాలో రబీ సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. యూరియా సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావ్, ఉన్నతాధికారులు సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్‌లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గద్వాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీసీలో పాల్గొని మాట్లాడారు. రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో ప్రస్తుతం 8124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు 5816 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేసినట్లు చెప్పారు. కౌంటర్ల వద్ద రైతులు క్యూలైన్‌లలో వేచి ఉండకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గద్వాలటౌన్: పట్టణ శివారులో నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనాల ప్రారంభోత్సవానికి మిగిలిన అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నర్సింగ్ కళాశాల అకాడమిక్ బ్లాక్ భవనం, వసతి గృహ భవనాల సమూదాయాలను కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల, వసతి గృహ నిర్మాణాలలో మౌలిక వసతులు కల్పించి, పెండింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. జనవరిలో నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం ఉంటుందని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
కేంద్రీయ విద్యాలయ స్థల పరిశీలన
కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో అయిదు ఎకరాల స్థలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో రెవెన్యూ అధికారులు అందజేశారు. కేంద్రీయ విద్యాలయం భవనం పూర్తయ్యే వరకు తరగతులను పాత ఎస్పీ కార్యాలయంలో లేదా గద్వాల కేజీబీవీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ, తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


