వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
గద్వాలటౌన్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాలు, వైకుంఠ ద్వార దర్శనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో అగ్రహారంలోని కృష్ణానది చెంతన ఉన్న కల్యాణ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలోని ఉత్తర ద్వారం తరహాలోనే వైకుంఠ ద్వారాన్ని విద్యుద్దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీవారి దశావతారాల ప్రతిమలతో పాటు అష్టలక్ష్మీదేవి ప్రతిమలను ద్వారంలో ఏర్పాటు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో అలంకరించారు. దర్శనానంతరం వైకుంఠ ద్వారంలోకి వెళ్లిన భక్తులకు గోవింద నామాలు వినపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గర్భాలయంతో పాటు పరివార దేవతామూర్తల ఆలయాలను సైతం విశేషంగా అలంకరించారు. అదే విధంగా జిల్లాలోని అలంపూర్, మల్దకల్, పాగుంట, ఉత్తనూరు, బీచుపల్లి లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి.


