రాష్ట్రస్థాయి కబడ్డీ రన్నరప్‌గా గద్వాల
గద్వాలటౌన్: కరీంనగర్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో గద్వాల జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో సూర్యాపేట, జోగులాంబ గద్వాల జల్లా జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల క్రీడాకారులు హోరాహోరీగా తలబట్టారు. 44–32 పాయింట్ల తేడాతో సూర్యాపేట గెలుపొంది విజేతగా నిలిచింది. గద్వాల జిల్లా జట్టు రన్నర్‌గా నిలిచింది. రన్నర్‌గా నిలిచిన గద్వాల కబడ్డీ క్రీడాకారులను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ట్రెజరర్ చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, కోచ్ హుస్సేన్ అభినందించారు.
‘ప్రజావాణి’కి 82 వినతులు
గద్వాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 82 వినతులు అందాయి. కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మొత్తం 82 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చాయి. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై వినతులు వచ్చాయి. వినతులను త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 20 అర్జీలు
గద్వాల క్రైం: భూవివాదం, ఆస్తి తగాదాలు, అప్పు తీసుకున్న వ్యక్తులు డబ్బు తిరిగి ఇవ్వడంలేదు.. ఇలా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు బాధితులు 20 అర్జీలు అందజేశారు. ఎస్పీ శ్రీనివాసరావు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,600
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 645 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.8600, కనిష్టం రూ.3570, సరాసరి రూ.6307 ధరలు లభించాయి. అలాగే, 13 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.6060, కనిష్టం రూ.5830, సరాసరి రూ.6060 ధరలు పలికాయి. 53 క్వింటాళ్ల వరి (సోన)కిగాను గరిష్టం రూ. 2509, కనిష్టం రూ. 2146, సరాసరి ధరలు రూ. 2250 వచ్చాయి. అలాగే, 294 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6639, కనిష్టం రూ. 1719, సరాసరి రూ. 6619 ధరలు లభించాయి.
వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ
గద్వాల క్రైం: నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి నుంచి వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, పెద్ద శబ్దంతో సౌండ్‌బాక్సులు ఏర్పాటు చేసినా సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు.


