సాగునీరు, వైద్య ఇక్కట్లపై అసెంబ్లీలో ప్రస్తావన
అలంపూర్: నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు, మెరుగైన వైద్యం అందక ప్రజలు, పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఎమ్మెల్యే విజయుడు సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. చిన్నోనిపల్లి నుంచి ఆర్డీఎస్ కెనాల్‌కు లింకు కలపాలని, నెట్టంపాడు 99,100 ప్యాకెజీల పనులు పూర్తి చేయాలని, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల ప్రముఖ్యతను వివరించినట్లు తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సాగు నీరు అందించడానికి వీలుగా మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వైద్యం అందక రోగులు అనేక కష్టాలు పడుతున్నారని, విధిలేక కర్నూల్‌కు వెళ్తే రాష్ట్రం మారడం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించకపోవడంతో జేబులు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికై న గ్రామ సర్పంచ్‌లకు ఎక్కువ నిధులిచ్చి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. సంబంధిత మంత్రి ఈ విషయాలపై స్పందించినట్లు తెలిపారు.
నేడు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రకాల ప్రైవేట్ కంపెనీలో 200 ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 89193 80410, 99485 68830 నంబర్లను సంప్రదించాలని కోరారు.


