
ముగిసిన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన మంగళవారం ఉత్తరారాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాఘవేంద్రస్వామి బృందావనానికి పంచామృత అభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో బృందావనాన్ని సుందరంగా అలంకరించారు. అదే విధంగా భీంనగర్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
● ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తిని పూల పల్లకీలో తీసుకెళ్లి రథంపై కొలువుదీర్చారు. షేరెల్లి వీధిలోని రాఘవేంద్రస్వామి మఠం నుంచి శేషదాస భజన మండలి సభ్యులు, భక్తుల పాటలు, భజనల మధ్య స్వామివారి ఊరేగింపు సాగింది. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం చుట్టూ రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో బీజేపీకే అత్యధిక సభ్యత్వాలు
అయిజ: దేశంలో అత్యధిక సభ్యత్వాలు గల పార్టీ బీజేపీ అని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మంగళవారం అయిజలో బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు సమష్టిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, అక్కల రమాదేవి, వెంకటేశ్,, ఆంజనేయులు, లక్ష్మణ్‌గౌడ్, నర్సన్న, అంజి, రాజేశ్‌గౌడ్, శశికుమార్, పరశురాముడు, మహేశ్, రాజశేఖర్, గోపాల్, సుంకన్న పాల్గొన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు రెండో విడత శిక్షణ
గద్వాల: జిల్లాలోని లైసెన్స్‌డ్ సర్వేయర్లకు రెండో విడత శిక్షణ ఈ నెల 18నుంచి నిర్వహించనున్నట్లు భూ కొలతలు, సర్వేశాఖ ఏడీ రాంచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 285 లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఉండగా.. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తిచేయడం జరిగిందన్నారు. రెండో విడత 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ముగిసిన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు