
వంద పడకల ఆస్పత్రి భవనానికి లీకేజీలు
అలంపూర్: కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనంలో లీకేజీలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రాకముందే భారీ వర్షాలకు లీకేజీల రూపంలో నీరు దిగువకు రావడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లీకేజీలు కనిపించాయి. లీకేజీలతో వర్షపు నీరు లోపల పడుతుండటంతో సిబ్బంది బకెట్లతో నీటిని తోడేశారు. ఇటీవల వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లీకేజీల ద్వార వర్షపు నీరు లోపలికి చేరుతుంది. దశల వారీగా రెండు భవనాల స్లాబ్‌లు వేర్వేరుగా వేయగా.. రెండు స్లాబులు కలిసిన చోట కాంట్రాక్టర్ కేవలం ఒక ఇనుప రేకుతో కప్పి వదిలేశాడు. దీంతో లీకేజీ అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వంద పడకల ఆస్పత్రి భవనానికి లీకేజీలు