
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
గద్వాల: పిల్లల్లో నులిపురుగులు నివారించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయన పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటి నివారణ కోసం ప్రతిఏటా ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి పౌరులే దేశానికి రేపటి వెలుగులని.. అలాంటి పౌరుల ఆరోగ్యం కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతిశుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు సీజనల్‌లో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూనే విద్యపై కూడ శ్రద్ధ వహించాలన్నారు. గతంలో పదో తరగతిలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండేదని అయితే గతేడాది 10.36శాతం వృద్ధిరేటు సాధించి 91.74శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయనున్నట్లు తెలిపారు. కార్యమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప, డీడీఎంహెచ్‌వో డాక్టర్ సంధ్య, వైద్యులు కిర్మయి, రిజ్వాన, పాఠశాల అధ్యపకులు జహీరుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు.
రాఖీకట్టిన బాలసదనం విద్యార్థులు
రాఖీపండుగను పురస్కరించుకుని బాలసదనం విద్యార్థులు కలెక్టర్ బీఎం సంతో్‌ష్‌కు రాఖీకట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.
విద్యార్థుల అభిరుచులను ప్రోత్సహించాలి
గద్వాలటౌన్: ఘల్లుఘల్లుమనే గజ్జల సవ్వడితో చిన్నారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. సోమవారం స్థానిక గద్వాల బాలభవన్‌లో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దేశభక్తిని చాటుదాం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టకర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల నాట్యాంశాలను తిలకించారు. ప్రతిభ చాటిన విద్యార్థుళకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ చిన్నారులలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని సూచించారు. సమాజాన్ని చైతన్య పర్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసానాల బారినపడ కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. త్వరలోనే అన్ని హంగులతో కూడిన ఆడిటోరియాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు, ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో కలెక్టర్ బీఎం సంతోష్

నులిపురుగుల నివారణతో ఆరోగ్యం