ఏం జరుగుతుందంటే..
జిల్లాలో ఇసుక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మన ఇసుక వాహనం పేరుతో కొన్ని ట్రాక్టర్లకు అనుమతులిచ్చింది. అయితే వారు ఆన్‌లైన్‌లో తమ ట్రాక్టర్‌ను నమోదు చేసుకునేందుకు కొంత నగదును ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు ఇసుకను ప్రజలకు అందించే క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను అందిస్తున్నారు. ఈ క్రమంలో వారికి నష్టాలు కూడా తప్పడం లేదు. కాగా నదిలో ఇసుక కూడా తక్కువగా ఉండటంతో ఎక్కడ లభ్యత ఉంటే అక్కడికి వెళ్లి ఇసుకను తీసుకుంటున్నారు. కానీ కర్నూల్ జిల్లా అధికారులు నదిలోకి వెళ్తున్న గద్వాల జిల్లా ట్రాక్టర్లను తమ హద్దులోకి వచ్చారనే నెపంతో బెదిరించడం, ఫొటోలు తీసుకోకుండా ఫోన్‌లు లాక్కోవడం, జరిమానాలు విధించడం చేస్తున్నారు. కానీ ఏపీకి చెందిన ట్రాక్టర్లతోపాటు నదిలో నీరున్న సమయంలో నేరుగా స్టీమర్లు జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుకను తోడుతున్నా ఇక్కడి జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా నదిలో అష్టకష్టాలు పడి నదిలో ఇసుకను లోడ్ చేసుకుని వస్తున్న అనుమతి ఉన్న ట్రాక్టర్లపై రాజకీయ కక్ష్యలతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ట్రాక్టర్ల యజమానులు ఇసుక వాహనాలను నడిపేందుకు జంకుతున్నారు. నదిలో దిగితే ఏపీ అధికారుల బెదిరింపులు, బయటకు వస్తే జిల్లా అధికారులు నానా కారణాలతో కేసులు చేస్తున్నారని ట్రాక్టర్ల యజమానులు అంటున్నారు. రోడ్ టాక్స్, ప్రభుత్వానికి ఆన్‌లైన్ కోసం టాక్స్ ఇతర అన్ని పన్నులు చెల్లిస్తున్నా తమకు అండగా ఉండటం వదిలేసి ఏపీ అధికారులతో సమానంగా కేసులు చేయడం దారుణమని అంటున్నారు.


