వంతెన నిర్మాణం పూర్తి చేయాలి
అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఆదివారం అంతరాష్ట్ర రహదారిపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. పట్టణ సమీపంలోని తుపత్రాల రోడ్డుకు సంబంధించిన పోలోనివాగుపై నిర్మించతలపెట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం వద్ద వంట చేసుకొని, రోడ్డుపైనే కూర్చొని సహపంక్తి భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులకు సంబంధించిన అంతరాష్ట్ర రహదారి వెంట సుమారు 15 గ్రామాలు ఉన్నాయని, అదేవిధంగా మంత్రాలయ పుణ్యక్షేత్రానికి ఇదే దారిలో వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఈ రోడ్డుపై ప్రతిరోజు వేలాదిమంది ప్రజలు ప్రయాణిస్తున్నారని, వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 2 సంవత్సరాలవుతున్నా ఇంకా పూర్తికాలేదని, ఈరోడ్డు నిర్మాణం దశాబ్దకాలంగా పూర్తికాలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపత్‌కుమార్ ఆరు మాసాల్లో నిర్మాణం పూర్తిచేస్తానని ప్రజలను నమ్మించి మోసంచేశారని ఆరోపించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం తొంగి చూడడంలేదని ఆరోపించారు. వెంటనే నిర్మాణ పనులు పూర్తిచేయకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భగత్ రెడ్డి, శివారెడ్డి, ఆంజనేయులు, చక్రవర్తి, అశోక్, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్; అంజి తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర రహదారిపై
వంటావార్పుతో నిరసన


