పంచాయతీలకు ఊరట
● నూతన సర్పంచ్‌లకు ఉపశమనం
● రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేక ఖజానా ఖాళీ
చిన్న, మేజర్ జీపీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటన
సొంత నిధులతోనే..
సర్పంచ్‌గా గెలిచిన అనంతరం గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సొంతంగానే నిధులు ఖర్చు చేస్తున్నాను. సీఎం ప్రకటనతో నిధులు వస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – సరోజినమ్మ,
సర్పంచు సోంపురం కేటి.దొడ్డి మండలం
త్వరగా విడుదల చేయాలి
గ్రామంలో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్లు వంటివి మొదలుకుని మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరం. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా. – వీరన్న,
సర్పంచు కొండేరు ఎర్రవల్లి మండలం
గద్వాల: రెండేళ్లుగా ప్రత్యేక పాలనలో నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ఎన్నికల క్రతువు పూర్తికావడం, నూతన సర్పంచులు కొలువుతీరడం జరిగిపోయింది. గెలుపొందిన సర్పంచులు ఆనందంతో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనందం కాస్త ఆవిరైపోయింది. గ్రామా పంచాయతీ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడం, నిత్యఅవసరాల నిమిత్తం కూడా నిధులు లేకపోవడం వంటి స్వాగతం పలకడంతో సర్పంచులు కొంత ఆందోళనకు గురయ్యారు. రోజు వారి పారిశుద్ధ్య పనులకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేందుకు సైతం డబ్బులు లేనిదుస్థితి. ఈనేపథ్యంలో చాలా చోట్ల నూతన సర్పంచులు సొంతడబ్బులతోనే చిన్నాచితక పనులు చేయిస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం, మైనర్ జీపీలకు రూ.5లక్షలు, మేజర్ జీపీలకు రూ.10లక్షల చొప్పున కేటాయిస్తామని చెప్పడంతో సర్పంచులు కొంతవరకు ఊరట చెందారు.
పంచాయతీలకు ఊరట


