జిల్లాలో కొన్ని సంఘటనలు.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో కొన్ని సంఘటనలు..

Feb 7 2025 1:21 AM | Updated on Feb 7 2025 1:21 AM

జిల్లాలో కొన్ని సంఘటనలు..

జిల్లాలో కొన్ని సంఘటనలు..

● 2025 జనవరి 19వ తేదీన గద్వాల పట్టణంలోని మైనార్టీ కులానికి చెందిన ఓ వ్యక్తి ధరూర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పట్టణ శివారులోని రెండు ప్లాట్లను రూ.25లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు యజమాని స్థలం వద్దకు వెళ్లగా.. ఈ భూమి ప్రభుత్వ స్థలమని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని బోర్డు కనిపించింది. దీంతో జరిగిన మోసంపై బాధితుడు సదరు వ్యాపారిని ప్రశ్నించగా వేరే చోట ఉన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసిస్తానని నమ్మబలికాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా అతని ఫిర్యాదు మేరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై పట్టణ పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

● 2024 నవంబర్‌ 22వ తేదీన గద్వాల మండలానికి చెందిన ఓ మహిళ గద్వాల పట్టణంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వద్ద రూ.2.50లక్షలకు ప్లాట్‌ కొనుగోలు చేసింది. అయితే కొన్ని నెలల తర్వాత ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఈసి తీయగా అప్పటికే ఇద్దరు వ్యక్తులపై ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయి ఉంది. దీంతో సదరు వ్యాపారిని మహిళ నిలదీయగా.. మరో చోట స్థలం రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని చెప్పాడు. నేడు రేపు అంటూ కాలయాపన చేయడంతో బాధితురాలు న్యాయం చేయాలని పట్టణ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో సదరు వ్యాపారిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

● 2024 డిసెంబర్‌ 12వ తేదీన జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఓ వ్యక్తి పట్టణానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో రూ.50లక్షలు వెచ్చించి ప్లాట్‌ కొనుగోలు చేశాడు. అయితే రిజిస్ట్రేషన్‌ సమయంలో అసలు విషయం తెలిసింది. ఈ స్థలాన్ని రోడ్డు నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం సేకరించి.. సదరు వ్యాపారికి నష్టపరిహారం సైతం చెల్లించింది. ఈ విషయాన్ని దాచి తనను మోసం చేశాడని పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అలాగే, కొందరు వెంచర్ల నిర్వాహకులు ఒక ప్లాట్‌ను ఇద్దరికి విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. వెంచర్‌లో ప్లాట్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి కేవలం ప్లాట్‌ నంబర్‌ మాత్రమే కేటాయించడం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కలిసి వస్తుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో సంబంధిత అధికారులు గుర్తించినా వారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసి పంపించేస్తున్నారు. ఎప్పుడైతే వారు ఇల్లు నిర్మించుకునేందుకు వెళ్తారో అప్పుడు మోసాలు బయటకు పడుతున్నాయి. ఇలా జిల్లా కోర్టులో ఎన్నో కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇప్పటికై నా నిబంధనలు కఠినతరం చేయాలని.. మరొకరు మోసపోకుండా దోషులను చట్టప్రకారం శిక్షించాలని.. బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

● 2025 ఫిబ్రవరి 3వ తేదీన శాంతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి అయిజ పట్టణంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వేసిన వెంచర్‌లో రెండు ప్లాట్లను రూ.59లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే రిజిస్ట్రేషన్‌ చేయించడంలో రోజులు, నెలలు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఎక్కడో మోసం జరిగిందని గ్రహించి విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై విచారణ చేయించాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement