సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు ప్రభావిత జిల్లాల జాబితానుంచి ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాలను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న విడుదల చేసిన ‘నక్సల్స్ ఫ్రీ ఇండియా’ ప్రత్యేక నివేదికలో వెల్లడించారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాల పరంగా కీలకమైనవి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపం, మారుమూల గ్రామాల భౌగోళిక పరిస్థితులు గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు అనుకూలంగా ఉండేవి. కేంద్ర హోంశాఖ 2024 ఏప్రిల్ నాటి ప్రభావిత జిల్లాల జాబితాలో తెలంగాణ నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలు అప్పటికే ఆ జాబితా నుంచి తొలగించారు. తాజాగా దేశవ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత జిల్లాల హోదానే తొలగించడంతో ములుగు కూడా ఆ వర్గీకరణలో లేకుండా పోయింది.
సరిహద్దుల్లో ఆపరేషన్లు..
భద్రతా సమన్వయం
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాల చర్యలు మావోయిస్టు కార్యకలాపాల కట్టడిలో కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా కర్రెగుట్టల ప్రాంతంలో గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్.. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల సమన్వయానికి ఉదాహరణగా నిలిచింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ తదితర బలగాల మధ్య సమన్వయం, నిఘా వ్యవస్థ బలోపేతం, అటవీ ప్రాంతాల్లో భద్రతా చర్యలు విస్తరించడం ద్వారా మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించే ప్రయత్నాలు కొనసాగాయి.
భద్రతతో పాటు అభివృద్ధి..
మారుమూల గ్రామాలకు వసతులు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేవలం భద్రతా చర్యలకే పరిమితం కాకుండా మారుమూల గిరిజన గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ, బ్యాంకింగ్ సేవలు, విద్యా అవకాశాలు విస్తరించడంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయని కేంద్రం పేర్కొంది. మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంలో లొంగుబాట్లు, పునరావాస విధానాలు కూడా కీలక పాత్ర పోషించాయని కేంద్రం తెలిపింది. లొంగిపోయిన వారికి ఆర్థిక సాయం, నెలవారీ స్టైపెండ్, ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఇతర పునరావాస సదుపాయాలు కల్పించినట్లు వివరించింది. గతంలో తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా భద్రతా నిఘా, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి వంటి గతంలో ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థల కొనసాగింపు కీలకంగా మారింది.
మావోయిస్టు ప్రభావిత జిల్లాల జాబితానుంచి ములుగు,
భూపాలపల్లి తొలగింపు
కర్రెగుట్టల ఆపరేషన్‌తో
సరిహద్దుల్లో కీలక పరిణామం
కేంద్రం విడుదల చేసిన
‘నక్సల్స్ ఫ్రీ ఇండియా’లో వెల్లడి


