టేకుమట్ల: టేకుమట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ అమలు కావడం లేదు. పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం మెనూకు విరుద్ధంగా పప్పు, సాంబార్, కోడిగుడ్డుతో భోజనం అందించారు. రాగిజావ అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వారానికి రెండుసార్లు రాగిజావ అందించాలనే నిబంధన ఉంది. ప్రభుత్వం నుంచి అరకొరగా రాగిపిండి సరఫరా అవుతుంది. విద్యార్థుల సంఖ్యలో పావలా వంతు కూడా అందడం లేదు. దీంతో నిర్వాహకులు చేసేదేమీ లేక వారానికి ఒకసారి మాత్రమే అది కూడా నీళ్లు ఎక్కువగా పోసి రాగిజావ అందిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు ఆ జావను తాగేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.


