న్యూస్‌రీల్
పెరిగిన ధరలతో
భారంగా వంట నిర్వహణ
● ఫలితంగా పాఠశాలల్లో
అమలు కాని మెనూ
● ఇబ్బందిపడుతున్న
సర్కారు బడుల్లోని పిల్లలు
● గ్యాస్ భారంతో
కట్టెల పొయ్యిలపైనే వంటలు
భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ గాడి తప్పింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో మెనూ పాటించకపోవడం, కూరల్లో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు తినేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక పలు పాఠశాలల్లోని విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తిని, మళ్లీ బడికి వస్తున్నారు. శుక్రవారం సాక్షి బృందం పలు పాఠశాలలను పరిశీలించింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 18వేల విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారు. వీరికి పీఎం పోషణ్–మిడ్ డే మీల్ పథకం కింద మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒక్కో విద్యార్థికి భోజనం ఖర్చు కింద రూ.6.78, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థికి రూ.10.17 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈ ధరలు గతేడాది మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్ల ధరలకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏ మాత్రమూ సరిపోవడం లేదు. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని తెలుస్తోంది. కూరగాయలకు బదులుగా సాంబార్‌ను తలపించే పప్పు లేదా తక్కువ ధర కూరగాయలనే ప్రతీరోజు వండుతున్నారు. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధర రూ.వేయి దాటింది. దీంతో చేసేదేమీ లేక నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.
కట్టెల పొయ్యిలపై వంట...
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో 185 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 81 మంది హాజరుకాగా వారికి మధ్యాహ్న భోజనం వడ్డించారు. గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,013 ఉంది. అంత మొత్తం చెల్లించి గ్యాస్‌పై వంట చేయలేక నిర్వాహకులు అడవిలోని కట్టెలను ఏరుకొని వచ్చి వంటలు వండుతున్నారు. జూన్ నెల నుంచి తమకు మధ్యాహ్న భోజన బిల్లులు అందడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.
ఉప్పు, పప్పు, నూనె, కారం ఇలా అన్ని సరుకులు, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కో కూరగాయ కేజీ రూ.80 వరకు ఉంది. దీంతో ప్రభుత్వం అందించే డబ్బులకు కూరగాయలు కూడా రావడం లేదు. ఒక్క కోడిగుడ్డు ధర ఇప్పుడు రూ.8 ఉంది. ప్రభుత్వం రూ.5 మాత్రమే చెల్లిస్తుంది. పెరిగిన ధరలతో మధ్యాహ్న భోజనం వండటం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం స్పందించి భోజన బిల్లును పెంచాలి.
– మోడెం సత్తమ్మ, వంట నిర్వాహకురాలు,
ములుగుపల్లి పాఠశాల, మహాముత్తారం
వారానికి రెండుసార్లే గుడ్లు..
మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్లు అందించాల్సి ఉండగా రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు వాపోయారు. మెనూ ప్రకారం కూరలు వండటం లేదని, ఎక్కువగా పప్పు, మిల్‌మేకర్ కర్రీలే చేస్తున్నారని తెలిసింది. శుక్రవారం మెనూ పాటించకుండా మిల్‌మేకర్, సోరకూయ కూర, కోడిగుడ్డుతో విద్యార్థులకు భోజనం వడ్డించారు. మెనూ అమలు కాకపోవడంతో విద్యార్థులు భోజనం చేసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.


