రేగొండ: నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గణపురం సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై దాసరి సుధాకర్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
16న పిల్లల ప్రజావాణి
భూపాలపల్లి రూరల్: బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, బాలలపై జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలను అరికట్టడం, బాలల సమస్యలపై సమాజంలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి, బాలలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, వినతులను స్వీకరించనున్నట్లు తెలిపారు. బాలలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాలల సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
19న ఇందిరమ్మ కుటుంబ
జీవిత బీమా పథకం ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి పాల్గొన్నారు.
సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..
హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ఎల్‌నినో, వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
రాజకీయ జోక్యంతోనే సమస్యలు పెండింగ్
భూపాలపల్లి అర్బన్: రాజకీయ జోక్యంతోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. మందమర్రి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ టెండర్లలో సింగరేణికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ నెల 17న టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో సంస్థ స్వయంగా పాల్గొని బ్లాక్‌ను దక్కించుకోవాలన్నారు. తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణికే కేటాయించాలని స్పష్టం చేశారు. పీవీ ఓపెన్‌కాస్ట్ కోసం పోరాటం భూపాలపల్లి ప్రాంతానికి కీలకమైన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ గని ఏర్పాటులో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రామప్ప సరస్సుకు ముప్పు ఉందనే అభ్యంతరాలు, రాజకీయ, న్యాయపరమైన వివాదాలతో ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపించారు. గని సాధన కోసం ములుగు కలెక్టర్‌ను కలిసి నిరభ్యంతర పత్రం కోరినట్లు తెలిపారు. బకాయిల సాధన కోసం ఈ నెల 17, 18, 19 తేదీల్లో అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కేంద్ర కమిటీ నాయకులు కె.సారయ్య, కె.వీరభద్రయ్య, వైవీ రావు, సమ్మయ్య పాల్గొన్నారు.


