ఏఐటీయూసీ పోరాట ఫలితమే.. | - | Sakshi
Sakshi News home page

ఏఐటీయూసీ పోరాట ఫలితమే..

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో డిస్మిస్‌ కార్మికులకు తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ అన్నారు. ఈ విజయాన్ని ఇతర కార్మిక సంఘాలు తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో డిస్మిస్‌ కార్మికుల పునర్నియామక అంశాన్ని చేర్చామని, సమ్మె నోటీసులు, నిరంతర పోరాటం ఫలితంగా ప్రభుత్వం, యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేశాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మాతంగి రామచందర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ కార్యదర్శి గురిజపల్లి సుధాకర్‌రెడ్డి, భీమనాధుని సత్యనారాయణలు పాల్గొన్నారు.

బిల్ట్‌ ఇన్‌టేక్‌వెల్‌ పరిశీలన

మంగపేట : మండల పరిధిలోని కమలాపురం గోదావరి ఒడ్డున గల బిల్ట్‌ ఇన్‌టేక్‌వెల్‌ను మిషన్‌ భగీరథ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ చలమారెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా పరిశీలించారు. కమలాపురంలోని వాటర్‌ గ్రిడ్‌లో శుద్ధి చేసిన గోదావరి నీటిని గ్రామాల్లోకి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. వాటర్‌ గ్రిడ్‌కు గోదావరి నీటిని పంపింగ్‌ చేసేందుకు ఏటూరునాగారం మండలంలోని రాంనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరఽథ ఇంటెక్‌వెల్‌ వద్ద ఇప్పటికే గోదావరి నీరు లేక పోవడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. రానున్న వేసవి కాలంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వివరించారు. గతంలో కమలాపురం బిల్ట్‌ ఫ్యాక్టరీ గోదావరి నీటిని వినియోగించేందుకు ఏర్పాటు చేసిన ఇంటెక్‌ వెల్‌ను వినియోగిస్తే తాగునీటి సమస్య రాకుండా ఉంటుందని గమనించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సునీత, డీఈ సుమన మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఇన్‌చార్జ్‌ ఏఈ పవన్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, జీపీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా

శివశంకర్‌ గౌడ్‌

భూపాలపల్లి రూరల్‌ : గౌడ ఐక్య సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా బత్తిని శివశంకర్‌ గౌడ్‌ను నియమించినట్లు ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ్‌, ఉపాధ్యక్షుడు బత్తిని మురహరిగౌడ్‌, నాయకులకు శివశంకర్‌ గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ట్రాప్‌ కెమెరాకు చిక్కిన వేటగాళ్లు

● ఐదుగురికి 14 రోజుల రిమాండ్‌

ఏటూరునాగారం: వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో వేటగాళ్లు పడ్డారు. దీంతో వారిపై అటవీశాఖ ఉక్కుపాదం మోపింది. ట్రాప్‌ కెమెరాకు ఏడుగురు చిక్కగా అందులో ఐదుగురిని 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు వన్యప్రాణుల క్షేత్రాధికారి హట్కర్‌ రమేశ్‌ గురువారం తెలిపారు. ఏటూరునాగారం అభయారణ్యంలో అటవీ ప్రాంతంలో చెట్లకు అమర్చిన కెమెరాల్లో వేటగాళ్ల ముఖాలు చిత్రీకరించబడ్డాయి. దీంతో వాటి ఆధారంగా నేరానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని ఖమ్మం కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement