మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే తమ లక్ష్యమని, ఇందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య అధ్యక్షతన శనివారం మున్సిపల్‌ కార్యాలయంలోని మీటింగ్‌ హాల్‌లో కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ హాజరయ్యారు. సమావేశంలో ఏజెండాలోని 41 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రిష్ణాకాలనీ నుంచి సుభాష్‌కాలనీ వరకు రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. విస్తరణలో భాగంగా చిరు దుకాణాలు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి మరోచోట స్థలం లేదా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి ఇస్తామన్నారు. అద్దెకు ఇచ్చిన వారికి ఎటువంటి అవకాశం ఇవ్వబోమన్నారు. ఎన్పీడీసీఎల్‌, మిషన్‌ భగీరథ అధికారులు వెంటనే విద్యుత్‌ స్తంభాలు, తాగునీటి పైప్‌లైన్‌లను తొలగించి రహదారి పక్కన ఏర్పాటు చేయాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో కరువు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటిని వృథా చేయరాదన్నారు. ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తేనే మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వాలని సూచించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఉన్న సమ్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్లపై విద్యుత్‌ తీగలు వేలాడుతున్నాయని, తాగునీరు, కోతుల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వంద పడకల ఆస్పత్రికి వెళ్లిన చాలామంది రోగులను చిన్నచిన్న చికిత్సల కోసం సైతం ఎంజీఎంకు రెఫర్‌ చేస్తున్నారని, ఇక్కడే పూర్తిస్థాయి వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, సింగరేణి, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

రహదారుల విస్తరణకు

అందరూ సహకరించాలి

తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ స్తంభాలు వెంటనే తొలగించాలి

చిరు వ్యాపారులను ఆదుకుంటాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement