● హాజరు సరిగా నమోదు చేయాలి
● డీఆర్డీఓ బాలకృష్ణ
మల్హర్(కాటారం): కూలీల సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఆర్డీఓ బాలకృష్ణ ఉపాధి సిబ్బందికి హెచ్చరించారు. శనివారం మండలంలోని నస్తురుపల్లి, కాటారం గ్రామాల్లో జరుగుతున్న వీబీజీరాంజీ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బాలకృష్ణ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపడుతున్న కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ పాండ్ (నీటి నిల్వ కుంటల) పనులను పరిశీలించిన ఆయన, పని ప్రదేశంలో కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత కొలతల ప్రకారం పనిచేస్తే ప్రతీ కూలీకి రోజుకు రూ.308 వేతనం వస్తుందని వివరించారు. పని ప్రదేశాల్లో కూలీలకు ఉచితంగా తాగునీరు, నీడ పందిళ్లు, అత్యవసర వైద్యం కోసం మెడికల్ కిట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో రోజువారీగా 200నుంచి 300మంది కూలీలను పనుల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. సాంకేతిక సహాయకులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ, పనులు నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, ఈసీ శ్రీకాంత్, టెక్నికల్ అసిస్టెంట్ కల్యాణి, ఫీల్డ్ అసిస్టెంట్లు రాజేశ్, రాజమణి పాల్గొన్నారు.


