– IIలోu
గ్రామాల్లో దీపావళి పండుగ శోభ
పండుగ పూట జర పైలం
● దీపావళి నేపథ్యంలో విరివిగా వెలసిన
టపాసుల షాపులు
భూపాలపల్లి అర్బన్: ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులను తీసుకువచ్చే దీపావళితో జిల్లావ్యాప్తంగా పండుగ శోభ సంతరించుకుంది. నేడు (ఆదివారం) ఉదయం దీపావళి, బోగి పండుగ హారతులు నిర్వహించి సాయంత్రం ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోనున్నారు. నోముల కోసం సుదూర ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులంతా సొంత ఊళ్లకు చేరుకున్నారు. పట్టణంతో పాటు పల్లె లోగిళ్లు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి.
బాణసంచాలకు పెరిగిన ధరలు
గతేడాది కంటే ఈ ఏడాది మరింతగా ధరలు పుంజుకున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. చిచ్చుబుడ్డీలు రూ.30నుంచి రూ.800 వరకు, క్రాకర్స్ బాక్స్ రూ.250 నుంచి రూ.600 వరకు, స్టార్స్ రూ.20, రూ.30, రూ.40 సైజుల ఆధారంగా విక్రయించారు. ఇతర ప్రాంతాల నుంచి బాణసంచా తీసుకువచ్చేందుకు హోల్‌సెల్ వ్యాపారులకు సైతం భారీగా రవాణా, ఇతర చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలు గతేడాదితో పోల్చుకుంటే అధికమని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల ప్రభావం ప్రత్యక్షంగా వినియోగదారులపై పడటంతో కొద్దిమొత్తంలో బాణసంచా కొనుగోలు చేసి వెళుతున్నారు.
వెలిసిన దుకాణాలు
జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మట్టి ప్రమిదలు, నోము దండలు, మట్టి బొమ్మలు, బంతిపూలు, పూజసామగ్రి దుకాణాలు ఏర్పాటు చేయగా వారాంతపు సంత స్థలంలో బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. పండగకు ముందు నుంచే సామగ్రి కొనుగోలు చేస్తున్నారు.
అందాల ప్రమిదలు
దీపావళి పండుగలో మట్టి ప్రమిదలకు ఎంతో విశిష్టత ఉంది. దీపాల కాంతుల్లో గృహాలు, ఆలయాలు మరింత శోభను సంతరించుకుంటాయి. వివిధ ఆకృతుల్లో ఆకట్టుకునేలా తయారు చేసిన ప్రమిదలు అందుబాటులోకి వచ్చాయి. రాజస్తాన్, కేరళ, ఢిల్లీ ప్రాంతాల్లో తయారైన వాటితో పాటు స్థానికంగా రూపొందించిన ప్రమిదలను విక్రయిస్తున్నారు. డజన్ల చొప్పున విక్రయాలు చేపడుతున్నారు.


