చరిత్రకు సజీవ సాక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

చరిత్రకు సజీవ సాక్ష్యం..

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 8 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

భూపాలపల్లి: మధ్యప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ‘బింబేట్కా’ రాతి చిత్రాల కంటే పురాతనమైన చరిత్ర.. వందల కోట్ల సంవత్సరాల క్రితం ప్రకృతి మలిచిన అద్భుత శిలాకృతులు.. పాండవుల అరణ్యవాస ముద్రలు.. ఇవన్నీ ఒక్కచోటే చూడాలంటే జిల్లాలోని ‘పాండవుల గుట్టలు’ సందర్శించాల్సిందే. ప్రాచీన మానవుడి జీవన శైలికి అద్దం పట్టే ప్రాక్‌ యుగం నాటి రాతిచిత్రాలు, సహజసిద్ధమైన శిలాతోరణాలు, శతాబ్దాల నాటి శాసనాలకు నిలయంగా ఉన్న ఈ గుట్టల విశేషాలతో ప్రత్యేక కథనం.

రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో పాండవుల గుట్టలు ఉన్నాయి. అరణ్యవాస కాలంలో పాండవులు ఈ గుట్టలలో ఉన్నారని స్థానికులు భావిస్తుంటారు. సుమారు 2వేల ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ గుట్టల్లో వేలాది కళాకృతులు పోగై ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సున్నపురాయి గుట్టలు వేల సంవత్సరాల కిందట ఏర్పడినట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. ఉలితో చెక్కకుండానే ఈ రాళ్లు శిల్పాల రూపాలయ్యాయి. నత్తగూళ్లుగా, సింహం, రామచిలుక, డాల్ఫిన్‌, నంది, మొసలి, మనిషి ముఖం ఇలా పలు ఆకృతుల్లో కనిపిస్తూ అబ్బురపరుస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో సున్నపురాళ్లు, అవక్షేప శిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు ఉన్నాయి. ఎత్తైన కొండ రాళ్ల మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్లు, ఆ కొండ గోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు ఉన్నాయి. పాండవుల గుట్టల్లో ప్రధానంగా ఎదురు పాండవులు, గొంతెమ్మ గుహ, పంచ పాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకుల గుండు చూడాల్సిన ప్రాంతాలు.

జీవన శైలి తెలిపే పెయింటింగ్స్‌..

పాండవుల గుట్టలోని కొన్ని ప్రాంతాల్లో ప్రాక్‌ యుగం నుంచి చారిత్రక యుగం వరకు గల మధ్య కాలంలో అప్పటి మానవుల జీవనశైలిని తెలిపే ఎన్నో చిత్రాలు రాతిపై ఉన్నాయి. సుమారు ఆరుచోట్ల ఈ పెయింటింగ్‌లు కనిపిస్తాయి. అవన్నీ కూడా ముదురు ఎరుపురంగుతో గీయబడినవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ పెయింటింగ్‌లలో శాఖాహార, మాంసాహార జీవులు, మనుషుల చిత్రాలు ఉన్నాయి. వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్లపందులు, కుందేళ్లు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప, బల్లి, ఎలుగుబంటి, పెద్దపులులు, పండు, వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం వంటి పెద్ద జంతువు, కుందేళ్లను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిలుచున్న మనిషి, ఈనిన జింక తన పిల్లను నాకుతుండగా చూస్తున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, కొన్ని శిథిలచిత్రాలు దర్శనమిస్తాయి. ఇవేకాక గొంతెమ్మగుహలో చేతిగుర్తులు, యుద్ధం చేస్తున్న వీరుల చిత్రాలు కూడా ఉన్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెళ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతీదేవి చిత్రాలు ఉన్నాయి.

బింబేట్కా కంటే ప్రాచీనమైనవి..

ఎదురు పాండవులు అనే కొండచరియలో వేసి ఉన్న రాతిచిత్రాలు అతి పురాతనమైనవి, అపూర్వమైనవని పురావస్తు నిపుణులు నిర్థారించారు. ఈ చిత్రాలు కొన్ని ఆరు అడుగుల కంటే ఎత్తుగా ఉన్నాయి. ఈ చిత్రాలు వేసిన తీరు, శైలి, మొరటుదనం, వాటిలోని జంతు జీవజాలం అన్నింటిని పరిశీలించి కాలానుశీలన చేస్తే ఇవి మనదేశంలోని మధ్యప్రదేశ్‌ ‘బింబేట్కా’ గుహల్లోని రాతిచిత్రాల కన్నా ప్రాచీనమైనవిగా భావిస్తున్నారు. వరల్డ్‌ హెరిటేజ్‌ చెప్తున్న విధంగా బింబేట్కా చిత్రాలు 30వేల సంవత్సరాల క్రితం నాటివి అయితే పాండవులగుట్టలోని బొమ్మల్లో అశ్వికులు, యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు, వివిధ వాహనాలు, అలంకరణలు వంటి ఆధునిక రూపాలేవీ లేవు. కావున ఇవి బింబేట్కా కన్నా ప్రాచీనకాలానికి చెందినవని పరిశోధకులు చెబుతున్నారు.

రెండువేల ఎకరాల్లో ‘పాండవుల గుట్టలు’

బింబేట్కా కంటే ప్రాచీనమైన

రాతి చిత్రాలు

చెలిమె, గుహలు, లఘు శాసనాలు, చెక్కని శిల్పాలు

6, 7 శతాబ్దం నాటి లిపితో రాసిన

రాతలు

అవిచ్ఛిన్న శిలాతోరణం..

పాండవుల గుట్టల్లో ఉన్న గుహలకు సమీపంలో అద్భుతమైన సహజసిద్ధమైన అవిచ్ఛిన్న శిలాతోరణం ఉంది. ఒక రాతిగుండులో రెండు నిలువుల ఎత్తున ఈ తోరణం ఎంతో అందంగా కనిపిస్తుంది. సహజ సిద్ధంగా రాతి పొరలతో ఏర్పడిన ఈ శిలాతోరణం వయస్సు సుమారు 200 కోట్ల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే, భూమి మీద ఏ ప్రాణి పుట్టకముందే ఈ తోరణం ఏర్పడినట్లు.

గొంతెమ్మ గుహలో విశేషాలెన్నో..

ఇక్కడి గొంతెమ్మ గుహలో చేతిముద్రలు, లిపులున్నాయి. ముదురు ఎరుపురంగులో కుడి చేతిముద్రలు ఉన్నాయి. గుహ బయట వీరుల యుద్ధ సన్నివేశం చిత్రించబడి ఉంది. రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదని భావిస్తున్నారు. గుహలో ఒక రాతిగోడ మీద బూడిద రంగుతో రాసిన లిపి ఉంది. ఇలాంటి రాతలే ఎరుపురంగులో పంచ పాండవుల గుహలో కూడా ఉన్నాయి. లిపిని బట్టి ఆ రాతలు 6, 7 శతాబ్దాల నాటివని అంచనా. గొంతెమ్మ గుహకు తూర్పు దిక్కులో ఒక బండరాయి అంచున ఒక ‘లఘుశాసనం’ ఉంది. అది ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసనం. ఇదే పేరుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 11 చోట్ల, మహారాష్ట్రలో ఒక చోట ఉన్నాయి. ఇంతటి విశిష్టతలు కలిగిన పాండవుల గుట్టను మరింత తీర్చిదిద్దితే పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement