ఏడాది సాగు.. ఆపై విక్రయం | - | Sakshi
Sakshi News home page

ఏడాది సాగు.. ఆపై విక్రయం

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

మహాముత్తారం: కాసుల కక్కుర్తికి పచ్చని రిజర్వ్‌ ఫారెస్టు బలైపోతుంది. అటవీ చట్టాలను తుంగలో తొక్కుతూ కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా గొడ్డలి వేటు వేస్తున్నారు. పోడు పేరిట విలువైన చెట్లను నేలమట్టం చేసి పక్కా ప్రణాళికతో అటవీ భూముల రియల్‌ వ్యాపారానికి తెరలేపుతున్నారు. మహాముత్తారం మండలంలోని పెగడపల్లితో పాటు ఆజంనగర్‌ రేంజ్‌ల పరిధిలోని కనుకునూర్‌, సింగంపల్లి, రెడ్డిపల్లి, నిమ్మగూడెం, పోలారం, మహబూబ్‌పల్లి తదిత ర గ్రామాల సరిహద్దులోని రిజర్వ్‌ ఫారెస్టు పరి ధిలో ఈ అక్రమ దందా జోరుగా సాగుతోంది.

సాగు ముసుగులో బేరసారాలు

అటవీ భూములను ఆక్రమించేందుకు కొందరు ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు. తొలుత దట్టమైన అటవీ ప్రాంతంలోని చెట్లను నరికి చదును చేస్తున్నారు. ఆ తరువాత పోడు భూమిగా మార్చి ఏడాదిపాటు ఏదో ఒక పంట సాగు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ భూమిపై తమకే సర్వహక్కులు ఉన్నాయంటూ స్థానిక పరిసర ప్రాంతాల వారికి నమ్మబలికి అమ్మకానికి పెడుతున్నారు.

ఏరియాను బట్టి డిమాండ్‌..

రోడ్డు మార్గానికి దగ్గరలో ఉంటే ఎకరాకు సుమారు రూ.2లక్షల వరకు ధర పలుకుతుంది. మరికొంచం అటవీ ప్రాంతంలో ఉంటే రూ.లక్షన్నర వరకు ధర నిర్ణయించి అమ్ముతున్నారు. నిరుపేద ఆదివాసీల కోసం ఉన్న పోడు హక్కుల అంశాన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు లాభాదాయక వ్యాపారంగా మార్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా విక్రయం

ఆజంనగర్‌ రేంజ్‌ పరిధిలోని కేశావాపూర్‌, నిమ్మగూడెం, నాగారం, కోనంపేట శివారులోని అటవీ ప్రాతంలో ఇటీవల కాలంలో ఒకే ప్రాంతంలో సుమారు 18 ఎకరాల పోడుభూమిని ఒక్కో ఎకరానికి సుమారు 2లక్షల చొప్పున అమ్మి సొమ్ముచేసుకున్నట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంత భారీ ఎత్తున భూములు చేతులు మారుతున్నా ఫారెస్టు అధికారులు పట్టించుకోకపోవడం వెనుక భారీ తతంగమే నడిచిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

మామూళ్ల మత్తులో యంత్రాంగం..

రిజర్వ్‌ ఫారెస్టులో పచ్చటి చెట్లు కూలుతున్నా.. ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు అటువైపు చూడకపోవడం వెనుక ముడుపుల పాత్ర ఉందన్న విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. చెట్లను కొట్టే సమయంనుంచి సాగుకు అనుకూలంగా మార్చేవరకు కొందరు ఫారెస్టు అధికారులు, సిబ్బంది ఎకరానికి 20వేల నుంచి 40వేల వరకు నజరానాలు తీసుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రక్షకులే చేతులు కలపడంతో రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధి క్రమంగా తగ్గిపోతోంది. ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి అటవీభూముల క్రయ విక్రయాలకు పాల్పడుతున్న దళా రులపై, సహకరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రిజర్వ్‌ ఫారెస్టులో

జోరుగా పోడు దందా

ఆజంనగర్‌ రేంజ్‌ పరిధిలో

18 ఎకరాలు అమ్మకం

పెగడపల్లి, ఆజంనగర్‌ రేంజ్‌లలో ఆగని అక్రమ వ్యాపారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement