విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి

Nov 5 2026 12:46 AM | Updated on Nov 5 2026 12:46 AM

● రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ములుగు/ ములుగు రూరల్‌: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి పోటీ ప్రపంచంలో ముందుండేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్‌ పాఠశాల విద్యాశాఖ– పదోతరగతి వార్షిక పరీక్షలు–2027, విద్యార్థుల సంసిద్ధతపై ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ములుగు కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమష్టి కృషితో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా ఉత్తమ స్థానాలు సాధించిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం విద్యలో వెనుకబడి ఉంటుందనే భావనను మార్చేసి జిల్లా విద్యార్థుల ప్రతిభను రాష్ట్రానికి చాటిచెప్పారని ప్రశంసించారు. కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేక చర్యలు మెరుగైన ఫలితాలకు దోహదపడ్డాయని వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా విద్యా ఫలితాల్లో వరుస విజయాలు సాధించడం ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి నిదర్శనమని అభినందించారు. విద్యారంగంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఉపాధ్యాయులదేనని వివరించారు. ఇదే ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి రాబోయే ఇంటర్‌, పదో తరగతి ఫలితాల్లో మరోసారి ఉత్తమ ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం మంత్రి సీతక్క జిల్లాకేంద్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న యువతకు అందిస్తున్న ఉచిత శిక్షణ శిభిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత అవకాశాలను అందిపుచ్చుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, డీఈఓ సిద్ధ్ధార్థరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనార్దన్‌, జీసీడీఓ, మండల విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement