భూపాలపల్లి: జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభావిత మండలాల రైతులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని బ్యాంకు అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎల్డీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు 12 నెలల మారటోరియం కల్పించడంతో పాటు రుణాల చెల్లింపు కాలపరిమితిని మొత్తం 36 నెలల వరకు పొడిగించే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు.
భూసేకరణ వేగిరం చేయాలి
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. పెండింగ్‌లో ఉన్న అవార్డుల జారీ, భూముల మ్యుటేషన్లు, ప్రతిపాదనలు, టైటిల్ వివాదాలు, ప్రభుత్వ భూములు తదితర అంశాలపై రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్ అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
అర్హులందరికీ పరిహారం
తాడిచర్ల డేంజర్ జోన్ పరిధిలోని అర్హులైన ప్రతీ కుటుంబానికి పరిహారం అంజేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జెన్‌కో, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం 2022వ సంవత్సరానికి ముందు గ్రామంలో నిర్మించిన.. గ్రామ పంచాయతీ లేదా పంచాయతీ కార్యదర్శి అనుమతులు పొందిన ఇళ్లను మాత్రమే అర్హత ప్రాతిపదికన పీఎన్‌లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, కేటీపీపీ సీఈ ప్రకాష్, ఎల్డీఎం నాగరాజు, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, రెవెన్యూ అధికారులు, సర్వే, ఇరిగేషన్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


