మళ్లీ ఉద్యోగ ఆశలు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉద్యోగ ఆశలు

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తూ అనివార్య పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య కారణాలు, ఇతర ఇబ్బందులతో విధులకు దూరమై చివరకు ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు తిరిగి ఉపాధి పొందే అవకాశం లభించింది. గైర్హాజరు కారణంగా డిస్మిస్‌ అయిన మాజీ ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సింగరేణి వ్యాప్తంగా 250 మంది ఉండగా భూపాలపల్లి ఏరియాలోని 50కిపై డిస్మిస్‌ కార్మికులు అయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఉద్యోగం కోల్పోయిన నాటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంతో సతమతమైన బాధితులకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

కార్మిక సంఘాల నిరంతర పోరాటం

గైర్హాజరు కారణంగా డిస్మిస్‌ అయిన కార్మికులకు మరో అవకాశం కల్పించాలని గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఇతర కార్మిక సంఘాలు గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి. ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయిన కార్మికుల కుటుంబాల పరిస్థితిని వివరించడంతో పాటు, వారి కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించాలని డిమాండ్‌ చేశాయి. బాధిత కార్మికులకు న్యాయం చేయాలని వినతిపత్రాలు, చర్చలు, ఇతర రూపాల్లో తమ డిమాండ్‌ను వినిపించాయి. గైర్హాజరుకు దారితీసిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, అర్హులైన వారికి పునర్నియామక అవకాశం కల్పించాలని కోరుతూ కార్మిక సంఘాలు చేసిన ప్రయత్నాలు ఈ అంశాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చాయి.

ఎదురుచూపులకు తెరపడేనా?

సింగరేణి యాజమాన్యం తాజా నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభిస్తుందా? గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటారా? అనే ప్రశ్నలు బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతున్నాయి. అర్హతల పరిశీలనలో పారదర్శకత పాటిస్తూ, నిజంగా ఉపాధి అవసరమైన కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ఆ సమావేశంలో ప్రస్తావన..

ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోల్‌బెల్ట్‌ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో డిస్మిస్‌ ఉద్యోగుల సమస్య ప్రస్తావనకు వచ్చింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఈ అంశాన్ని పరిశీలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో యాజమాన్యం పునర్నియామకానికి హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

డిస్మిస్‌ కార్మికుల సమస్యపై

హైపవర్‌ కమిటీ ఏర్పాటు

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కదలిక

సింగరేణి వ్యాప్తంగా 250 మంది

ఫలించిన కార్మిక సంఘాల

సుదీర్ఘ పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement