రోడ్డుపై ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు
కాళేశ్వరం: చేనుకాడికి పోయస్త బిడ్డ...అంటూ బైక్‌పై వెళ్లిన తండ్రి ఇసుక లారీ కిందపడి దుర్మరణం చెందిన ఘటన మహదేవపూర్ మండలం మెట్‌పల్లి పంచాయతీలోని బీరాసాగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. డాడీ.. ఒక్కసారి రావా.. ఎప్పుడొస్తావే! అంటూ ఇద్దరు కుమార్తెలు మృతదేహాన్ని చూపించాలని చేసిన రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన పోత స్వామి(45) మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లక్ష్మీపూర్‌లో తన అత్తగారి ఊరిలో మూడెకరాల్లో పత్తి సాగుచేశాడు. పత్తి చేనుకు పోయి వస్తానని ఇంట్లో చెప్పి మంగళవారం బైక్‌పై వెళ్లాడు. బీరాసాగర్ గ్రామం వద్ద క్వారీ నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ కాళేశ్వరం వెళ్తుండగా.. స్వామి కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో స్వామిని లారీ ఢీకొట్టడంతో వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కాళేశ్వరం ఎస్సై సురేష్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. తాము రాకముందే మృతదేహాన్ని ఎందుకు తరలించారని మృతుడి భార్య స్వరూప, కుమార్తెలు సాయిశ్రీ, శ్రావణి, కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో ఎస్సైపై మహిళలు దాడి చేయడానికి యత్నించారు. దీంతో ఎస్సైని ఘటనా స్థలం నుంచి తరలించారు.
ఐదు గంటలపాటు బైఠాయింపు..
సాయంత్రం 4గంటల నుంచి రాత్రి వరకు మహదేవపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతకీ రోడ్డుపై నుంచి కదలకపోవడంతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఎస్సైలు సాంబమూర్తి, శ్రీనివాస్, శశాంక్, మహేందర్ నచ్చజెప్పారు. సుమారు ఐదు గంటల పాటు రోడ్డుపై నుంచి కదలలేదు. ఇరువైపులా లారీలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులకు, బంధువులకు మృతదేహాన్ని చూపించలేదు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం రాత్రి మహదేవపూర్‌కు చేరుకొని బాధితులను పరామర్శించారు. టీజీఎండీసీ పీఓ రవీందర్‌తో మాట్లాడారు. రూ.5లక్షల పరిహారం ఇప్పిస్తానని చెప్పడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రూ.30లక్షల వరకు పరిహారం ఇప్పించామని తెలిపాడు. అనంతరం ఆస్పత్రికి చేరుకొని రాత్రి 9.30గంటలకు మృతదేహాన్ని కుటుంబసభ్యులతో కలిసి పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు వెంటనే న్యాయం చేసి పరిహారం ఇవ్వాలన్నారు.
బీరాసాగర్ వద్ద ఇసుక లారీ ఢీకొని
వ్యక్తి మృతి
మిన్నంటిన భార్య, కుమార్తెల రోదనలు
కుటుంబ సభ్యులు రాకముందే
మృతదేహాన్ని తరలించిన పోలీసులు
ఎందుకు తరలించారంటూ
పోలీసులతో వాగ్వాదం
సుమారు ఐదు గంటలపాటు
జాతీయ రహదారిపై ధర్నా
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు


