భూపాలపల్లి రూరల్: వానాకాలం సీజన్‌లో జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన కసరత్తును అధికారులు కొద్దిరోజుల క్రితమే ఆరంభించారు. ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా.. ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ ఇప్పటికే కేంద్రాల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
కోతలు ప్రారంభం..
జిల్లాలో కొన్ని చోట్ల కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం పరిస్థితి దిగుబడిపై పడే ప్రమాదం ఉంది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా. 18 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చే పరిస్థితి నెలకొంది. మొత్తంగా జిల్లాలో 1.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో కోతల ఊపందుకోనున్నాయి, ఆర్‌ఎన్‌ఆర్, బీపీటీ, కేఎన్‌ఎం 1638, తెలంగాణ సోన తదితర ఏడు సన్న రకాలను మాత్రమే వేయాలని, వీటినే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2,461 ఉంది. దీనికితోడు రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ, పీఏసీఎస్,, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి, ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఇప్పటికే కేంద్రాల సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి, తేమ మిషన్, ఇతర సామగ్రి, రికార్డులు అందించారు.
ప్రైవేట్‌లోనే అధిక ధర..
బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాత బియ్యం క్వింటా రూ.8వేలపైనే పలుకుతున్నాయి. ఈ లెక్కన వడ్లకు బాగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. కోతలు ఆరంభమైన కొన్ని జిల్లాల్లో వడ్లను క్వింటాకు రూ.3.700 నుంచి రూ.4వేల వరకు ప్రైవేట్ రైస్ మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రభుత్వ మద్దతు ధర, బోనస్ కన్నా ప్రైవేట్‌లో విక్రయిస్తే ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
జిల్లా వివరాలు.
వరిపంట సాగు
1,00,149 ఎకరాలు
కొనుగోలు కేంద్రాలు
170
సేకరణ లక్ష్యం
1,05,400
మెట్రిక్ టన్నులు
మద్దతు ధర
రూ. 2461
జిల్లాలో మొదలైన వరికోతలు
త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలకు ఆదేశం


