చిట్యాల: తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతల రజనీకాంత్ ఎన్నికయ్యారు. సంఘం జిల్లా మూడవ మహాసభ శాంతినగర్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా దామెర రమేశ్ పోలం రాజేందర్, జిల్లా సహాయ కార్యదర్శులుగా రాదారపు మల్లయ్య, సాదు రవి, సోషల్ మీడియా బాధ్యులుగా తడగొండ రమేశ్, జిల్లా కమిటీ సభ్యులుగా రామచందర్, బాసాని పైడి, అనంత లక్ష్మి, దుర్గం రాజేశ్‌లను ఎన్నుకున్నారు.
జాతీయస్థాయి పోటీలకు
శ్రీధర్ ఎంపిక
చిట్యాల: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి బానోతు శ్రీధర్ ఎంపికయ్యాడని మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 9వ తరగతి విద్యార్థి బానోతు శ్రీధర్ జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ నెల 12నుంచి 14వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పనుల పరిశీలన
మొగుళ్లపల్లి: వీబీజీరామ్ జీ పథకం కింద మండలంలోని ముల్కలపల్లి, ఇస్సిపేట గ్రామాల్లో జరుగుతున్న ఫీడర్ కాలువ పూడికతీత పనులను డీఆర్‌డీఓ బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడారు. భూగర్భ జలాలను పెంచే విధంగా జలసిరి కార్యక్రమంలో పనులను గుర్తించాలన్నారు. కూలీలకు 125 పనిదినాలను కల్పించాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్ ఆయా గ్రామాల సర్పంచ్‌లు యార ముకుందరెడ్డి, గాదం శ్రీవాణి, ఏపీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఉచిత శిక్షణ
భూపాలపల్లి అర్బన్: డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ నగేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్, టాస్క్ సంయుక్తంగా నిర్వహించే శిక్షణ తరగతులు 5వ తేదీ నుంచి భూపాలపల్లిలోని టాస్క్ కేంద్రంలో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. 18నుంచి 28 ఏళ్లలోపు డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. రోజుకు 4గంటల నుంచి 5 గంటల చొప్పున మొత్తం 90 గంటల పాటు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ సమయంలో అవసరమైన మెటీరియల్ ఉచితంగా అందించడంతో పాటు, శిక్షణ పూర్తిచేసిన వారికి ఇన్ఫోసిస్ సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 80740 31962 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఐసా రాష్ట్ర గర్ల్స్
కన్వీనర్‌గా స్వాతి
భూపాలపల్లి అర్బన్: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్‌గా బుర్ర స్వాతిని నియమించినట్లు ఐసా జాతీయ కమిటీ సభ్యురాలు వేమన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో గణపురం మండలానికి చెందిన బుర్ర స్వాతికి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థినులను ఐక్యం చేస్తూ విద్య, వైద్యం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానని స్వాతి తెలిపారు.


