భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సత్వర వైద్యచికిత్స అందించి విలువైన ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం రహత్’, ‘రహవీర్’ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి రహత్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత (క్యాష్ లెస్) వైద్య చికిత్స అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గుర్తింపు పొందిన ఆస్పత్రులు కిరణ్ ఆస్పత్రి (భూపాలపల్లి), యోధా ఆస్పత్రి, 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి (భూపాలపల్లి), మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రి, చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ‘రహవీర్’ పథకం ద్వారా ఒక ఘటనకు రూ.25,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిఏటా అత్యుత్తమ సేవలు అందించిన 10మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జాతీయ స్థాయి అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. అత్యవసర సహాయానికి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించేందుకు సహకరించాలని కోరారు. ప్రమాద బాధితులను చూసి నిర్లక్ష్యం చేయకుండా మానవతా దృక్పథంతో స్పందించి, సకాలంలో వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
వినూత్న కోడింగ్ భాషలకు ఎస్పీ ప్రశంసలు
కాళేశ్వరం: గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టించగలరని మహదేవపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు నిరూపించారు. దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే వినూత్న కోడింగ్ భాషలను అభివృద్ధి చేసిన విద్యార్థులను, వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయుడు డాక్టర్ మడక మధును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రత్యేకంగా మంగళవారం అభినందించారు. పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ మడక మధు, విద్యార్థులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. వెలగందుల తన్మయి, మాడిగ స్నిగ్ధ కనుబొమ్మల కదలికల ఆధారంగా పనిచేసే ఐబ్రో కోడింగ్ విధానాన్ని ఎస్పీకి వివరించారు. మేరుగు దినేష్, పెద్ది చైతన్ ‘మధుస్ కోడింగ్ లాంగ్వేజ్’ను ప్రదర్శించారు. వెలగందుల తరుణి, జుబియా బేగం కళ్ల కదలికల ఆధారంగా పనిచేసే ఐ కోడింగ్‌ను, కొక్కు సాయి కమల, తంజీయా ఖాతూన్ ముఖ కవళికల ఆధారంగా పనిచేసే ఫేస్ ఎక్స్‌ప్రెషన్ కోడింగ్‌ను ప్రదర్శించారు. విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


