భూపాలపల్లి: జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తూ వందలాది కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యానర్స్ కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో వేలాది మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. కొందరు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా మరికొందరు సర్కారు వైద్యం పొందుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారిలో అధిక శాతం మంది నయమై తమ పనులు తాము చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం క్యాన్సర్ కేసులు మహిళల్లోనే నమోదవుతుండటం ఒకింత ఆందోళనకు గురిచేస్తుంది.
ఎక్కువ శాతం మహిళలే..
జిల్లాలోని 12 మండలాల్లో వివిధ రకాల క్యాన్సర్ బారిన పడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 396 మంది చికిత్స పొందుతున్నట్లుగా ఇటీవల నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో అధిక శాతం బాధితులు మహిళలే ఉండటం గమనార్హం. 106మంది మహిళలు గర్భసంచి ముఖద్వార(సర్వైకల్) క్యానర్ బారిన పడగా, 120మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ కేసుల్లో మహిళలు 75 శాతం మంది, పురుషులు 25 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు వందల సంఖ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొగుళ్లపల్లిలో అధికంగా కేసులు..
మొగుళ్లపల్లి మండలంలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కాటారం, అంబట్‌పల్లి పీహెచ్‌సీల పరిధిలో 16కేసులు మాత్రమే నమోదు కాగా, ఒక్క మొగుళ్లపల్లి పీహెచ్‌సీ పరిధిలోనే ఏకంగా 80 కేసులు ఉన్నాయి. ఇందులో 64మంది వైద్యసేవలు పొందుతుండగా, 16మందికి పూర్తిగా నయమైంది.
అప్పులు చేసి ప్రైవేట్‌గా చికిత్స..
క్యాన్సర్ బారిన పడి వారు భయంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్స కోసం అప్పులు చేసి మరీ రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని బాధితుల్లో 297మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో, 99మంది ఎంఎన్‌జే, జీజీహెచ్‌లో వైద్యసేవలు పొందుతున్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. క్యాన్సర్ వ్యాప్తి ఒక హెచ్చరిక గంట లాంటిదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మండల కేంద్రాలు, పీహెచ్‌సీల్లో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై ముందస్తు పరీక్షలు, ప్రజల కు జీవనశైలి మార్పులు, పొగాకు నివారణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో బాధితుల వివరాలు
జీజీహెచ్‌లోనూ సేవలు అందిస్తున్నాం..
ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ నిర్ధారణ జరిగిన వెంటనే పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఫస్ట్ డోస్‌ను ఎంఎన్‌జేలో తీసుకున్నాక, మిగిలిన డోస్‌లను జిల్లా ప్రధాన ఆస్పత్రిలోనే అందిస్తాం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వైద్యుడిని నియమించింది. జీజీహెచ్‌లోని డే కేర్ క్యాన్సర్ సెంటర్‌లో నిత్యం సేవలు అందిస్తున్నాం. క్యాన్సర్‌పై అపోహలు వద్దు. వ్యాధి నిర్ధారణ కాగానే చికిత్స పొందితే ఇబ్బందులు ఉండవు.
– డాక్టర్ మధుసూదన్, డీఎంహెచ్‌ఓ
జిల్లాలో 396 మంది బాధితులు
రొమ్ము, గర్భాశయ క్యానర్స్ బారిన గ్రామీణ మహిళలు
ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న
బాధితులు
రూ.లక్షల్లో అప్పులు చేసి చికిత్సలు
జీజీహెచ్‌లోనూ అందుతున్న సేవలు
సర్వైకల్ క్యాన్సర్ 106
బ్రెస్ట్(రొమ్ము) క్యాన్సర్ 120
నోటి క్యాన్సర్ 44
ఇతర రకాల క్యాన్సర్లు 126
మొత్తం 396
కీమోథెరఫి పొందుతున్న వారు 35
చికిత్స పొందుతున్న వారు 186
చికిత్స పూర్తయిన వారు 149
మృతి చెందినవారు 26


