కాళేశ్వరం: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మీనాక్షి దంపతులు, గడ్చిరోలి కలెక్టర్ అవిశాంత్ పాండా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని బాలాలయంలో దర్శించుకున్నారు. సోమవారం వారు ఆలయానికి రాగా అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్‌శర్మ వారికి త్రివేణి అతిథి గృహం వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం అందించి శేషవస్త్రాలతో సీఎస్ దంపతులను సత్కరించారు.
పుష్కరఘాట్లు పరిశీలన..
త్రివేణి సంగమం సమీపంలోని సరస్వతీ పుష్కర ఘాట్‌ను సీఎస్, కలెక్టర్లు సందర్శించారు. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లు, ఘాట్ల అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్ రాహుల్ శర్మ మహారాష్ట్ర సీఎస్‌కు వివరించారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను మహారాష్ట్ర సీఎస్ రాజేష్, గడ్చిరోలి కలెక్టర్, కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకాలో అధికార పర్యటన నేపథ్యంలో రెండు రోజులుగా బస చేస్తున్నారు. ఆ క్రమంలో ఆదివారం మేడిగడ్డ బరాజ్, సోమవారం కాళేశ్వరాలయం, పుష్కరఘాట్లను పరిశీలించారు. గతంలో 2016, 2019లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సిరొంచ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రెండుసార్లు కాళేశ్వర క్షేత్రంలో దర్శనం చేసుకున్నట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డీఐజీ యోగేష్‌కుమార్, ఎస్పీ రమేశ్, కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్‌శర్మ, డీఎస్పీ సూర్యనారాయణ, ఎస్సై సురేష్, దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పుష్కరఘాట్లు, దేవస్థానం
పునర్నిర్మాణ పనుల పరిశీలన
గోదావరి పుష్కరాలపై సీఎస్‌కు
వివరించిన కలెక్టర్ రాహుల్‌శర్మ


